తనిఖీల తకరారు!.. అంతా తూతూ మంత్రం
రైస్ మిల్లుల అక్రమాలపై నామమాత్రపు తనిఖీలేనా?
రూ.4 వేల కోట్ల టెండర్ ప్యాడీ బకాయిలపై సమగ్ర విచారణకు డిమాండ్
బడా మిల్లర్ల మాయాజాలంలో జోగుతున్న అధికార యంత్రాంగం
ఆంధ్రప్రభ నిఘా విభాగం, హైదరాబాద్: రైతుల చెమటతో పండిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. వాటిని మిల్లింగ్ చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలి. కానీ బాధ్యత మరచిన పౌర సరఫరాల శాఖ అధికారుల అండతో వందల కోట్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు, ప్రభుత్వ యంత్రాంగాన్నే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కొద్దిపాటి రైస్ మిల్లుల్లో నిర్వహించిన ప్రాథమిక తనిఖీల్లోనే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యం లెక్కలకు, వాస్తవ నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మిల్లుల్లో ఒకేసారి సమగ్ర తనిఖీలు నిర్వహిస్తే మరెన్ని సంచలనాలు బయటపడతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం మిల్లులకు అప్పగించే ధాన్యానికి మిల్లు యజమానులు కేవలం సంరక్షకులు (కస్టోడియన్లు) మాత్రమే. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికే అప్పగించాలి. తాజాగా బయటపడుతున్న అంశాలు చూస్తే ప్రభుత్వ ధాన్యాన్ని సొంత ఆస్తిగా భావించి బహిరంగ మార్కెట్‌కు తరలించి, దోపిడీకి తెరతీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ గోదాముల నుంచి మిల్లులకు చేరిన ధాన్యం చివరకు ఎక్కడికి వెళ్లిందన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేకపోవడం గమనార్హం.
ధాన్యం మాయం వ్యవహారంలో కేవలం మిల్లర్లనే దోషులుగా పరిగణించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి దశలో ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించాల్సి ఉన్నా… వేల టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయమైనా గుర్తించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. క్షేత్రస్థాయి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌ఎస్‌ఐ), డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), జిల్లా మేనేజర్ (డీఎం), జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌వో) నుంచి ఉన్నతాధికారుల వరకు పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నా, అక్రమాలు ఏళ్ల తరబడి కొనసాగాయంటే అది కేవలం నిర్లక్ష్యమా, లేక కుమ్మక్కు వ్యవహారమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మామూళ్ల మత్తు… తనిఖీల గమ్మత్తు
మిల్లుల కేటాయింపు, ధాన్యం నిల్వల ధ్రువీకరణ, బియ్యం అప్పగింత, గోదాముల అనుమతులు… ఇలా ప్రతి దశలోనూ కాసులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకేచోట ఉద్యోగాల్లో తిష్టవేసిన కొందరు అధికారులు మిల్లర్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థనే బలహీనపరిచారన్న విమర్శలు ఉన్నాయి. బదిలీలు లేకపోవడం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించడం కూడా అక్రమాలకు కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి మిల్లుల్లో నిల్వలపై భౌతిక తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలి. మిల్లులో ఎంత ధాన్యం ఉంది, ఎంత బియ్యం తయారైంది, ఎంత ప్రభుత్వానికి అప్పగించారనే వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించాలి.
అయితే వాస్తవంగా తనిఖీలు జరిగాయా లేక కార్యాలయాల్లోనే కూర్చుని నివేదికలు తయారయ్యాయా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నిల్వలు లేకపోయినా సరిపడా ధాన్యం ఉందని నివేదికలు పంపడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
రూ.4 వేల కోట్ల టెండర్ ప్యాడీ లెక్కలెక్కడ..?
రాష్ట్రంలోని 314 రైస్ మిల్లులకు సంబంధించిన టెండర్ ప్యాడీ బకాయిల్లో ఇప్పటికీ సుమారు రూ.4 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం, నగదు పూర్తి స్థాయిలో రికవరీ కాలేదని తెలుస్తోంది. ఒకప్పుడు రూ.7 వేల కోట్లకు పైగా ఉన్న బకాయిల్లో కొంత మాత్రమే వసూలైనట్లు సమాచారం. నిబంధనలు పాటించిన మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ప్రభుత్వ సొమ్ము తిరిగి చెల్లించని కొందరు మిల్లర్లు మాత్రం అదే ప్రజాధనంతో వ్యాపారాలను విస్తరించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేవలం 25 మిల్లుల్లో నిర్వహించిన తనిఖీలు, విజిలెన్స్ కేసులతో వారం రోజుల్లో వంద కోట్లకు పైగా రికవరీ జరిగినట్లు ప్రచారం చేసుకుంటున్న పౌర సరఫరాల శాఖ, పూర్తి స్థాయిలో దృష్టిపెడితే వేల కోట్ల రికవరీ కావచ్చని రైతులు, ప్రజా సంఘాలు పేర్కొంటున్నారు.
అక్రమాలకు రాజకీయ అండ
ఇంత భారీస్థాయిలో అక్రమాలు ఒక్కరోజులో జరిగేవి కావు. సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై సమర్థవంతమైన చర్యలు కనిపించకపోవడం వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అధికార వర్గాలతో సాన్నిహిత్యం పెంచుకుని తమ అక్రమాలకు రక్షణ కల్పించుకుంటున్నారనే ఆరోపణలు కొందరు బడా మిల్లర్లపై ఉన్నాయి. పాలకులు, అధికారులు మారుతున్నా వ్యవస్థలో మార్పు కనిపించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
రాష్ట్రంలోని అన్ని రైస్ మిల్లుల్లో ఒకేసారి విజిలెన్స్, ఇంటెలిజెన్స్, పౌరసరఫరాల శాఖల సంయుక్త బృందాలతో సమగ్ర భౌతిక తనిఖీలు నిర్వహించాలని రైతు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసిన వారితో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు సహకరించినా సంబంధిత అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ప్రజాధనానికి రక్షణ లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
