BJP | సింగరేణిని నిర్లక్ష్యం చేస్తున్నారు.. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: సింగరేణి సంస్థ అభివృద్ధిపై మాట్లాడే ధైర్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికీ లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు.

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన సింగరేణి ముగింపు యాత్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వ పాలనలోనూ సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.27 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం అందకుండా సంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

సింగరేణిని రక్షించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ తాడిచర్ల బొగ్గు బ్లాక్-2ను వేలం వేయకుండా సింగరేణి కొలియరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కు కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఈ నిర్ణయంతో సింగరేణి మరింత బలోపేతం అవుతుందని, యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. అలాగే సంస్థలో అవినీతి కొనసాగుతోందని, టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదని ఆరోపించారు. సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి సంస్థను ఆదుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ నాయకులు అంజిరెడ్డి, నాగేష్, పాయల్ శంకర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెంకటేష్ నేత, గోమాస శ్రీనివాస్, శ్రీదేవి, వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, దుర్గం అశోక్, ఎర్రబెల్లి రఘునాథరావు, ఆర్మూర్ల పోశం, దన్ సింగ్, కట్ట ఈశ్వరచారి, వేముల అశోక్, రామ్ కిషోర్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.