ఆహారాన్ని బట్టే గుణం!

ఆహారం, ఆలోచనలు, గుణాల మధ్య ఉన్న సంబంధం

విదుర నీతి చెప్పే జీవన సత్యాలు

“ప్రకృతి ఆధారంగా, మానవులు తీసుకొనే ఆహారాన్ని బట్టి, మూడు గుణాలకు లోనవుతారని” శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. నేటి మనుష్యులలో సాత్త్విక గుణం కనుమరుగైపోయింది. రజోగుణం, తమోగుణంలతో అహంకారం, అసూయ, ద్వేషాలు, కక్షలు, పగ వంటి దుర్గుణాలతో సమాజం అల్లకల్లోలంగా ఉంది. సమాజం మంచిగా ఉండాలన్నా, చెడుగా ఉన్నదన్నా, మానవుల గుణాలే ప్రధానం. అందుకే మనలోని దుర్గుణాలను, అరిషడ్వర్గాలను విసర్జించుటకు, ఇతిహాసాలు, పురాణాలు వంటివి ఎంతో దోహదపడుతున్నాయి.

ధృతరాష్ట్రుడు స్వభావం అంతర్గతంగా స్వార్థ చింతనతో ఉంటే, పైకి అందరి క్షేమాన్ని అభిలషిస్తూ ఉన్నట్లు నటించేవాడు. మనశ్శాంతి కోసం, తన మంత్రి విదురుడు చేత మంచి ఉపశమన వాక్యాలు చెప్పించుకొని తన తాపాన్ని తగ్గించుకొనేవాడు. అలా విదురుడు చెప్పిన మంచి మాటలు కేవలం ధృతరాష్ట్రుడికే కాదు, ఆ లక్షణాలు ఉన్న మనకందరికీ ఉపయుక్తంగా ఉంటాయి. దానివల్ల మనలో నైతికతను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఒకసారి ధృతరాష్ట్ర మహారాజుకు మనసు అల్లకల్లోలంగా ఉండి నిద్ర పట్టకపోతే, విదురుడికి కబురు పంపి, ఆయనతో మనసుకు ఊరటనిచ్చే మంచి విషయాలు నాలుగు చెప్పమని కోరగా, విదురుడు ప్రారంభిస్తూ, “మహారాజా! బలవంతునితో వైరం పెట్టుకొన్న దుర్బలులకు, సంపద పోగొట్టుకున్న వారికి, కామునికి, చోరులకు ఈ నలుగురికి నిద్ర పట్టదు. క్షమాగుణం కలిగిన వ్యక్తులను చూసి సమాజం అసమర్థుడిగా ఆలోచిస్తుంది, కానీ అంతిమంగా విజయం అతనిదే. శాంతి అనే ఖడ్గం చేతపట్టిన వానిని దుర్జనుడు ఏమి చేయగలుగుతాడు? (ఏమీ చేయలేడని అర్థం). ఎలాగంటే గడ్డి లేని ప్రదేశాలలో పడిన నిప్పు దానంతట అదే ఆవిరైపోతుంది” అని వివరించాడు.

“రాజా! మూఢుడు చేయవలసిన పనిని నానుస్తూ ఉంటాడు. అడుగడుగునా సంశయాలతో ఆలస్యం చేస్తూ ఉంటాడు. మధుర పదార్థం నలుగురికీ పంచకుండా, ఒక్కరే తినకూడదు. అలాగే, క్లిష్టమైన విషయాలను ఒక్కడే ఆలోచించి నిర్ణయం తీసుకోకూడదు. నిత్యం ధనం రావడం, ఆరోగ్యం, కోరికున్న ఇల్లాలు, ప్రియమైన మాటలు మాట్లాడే భార్య, చెప్పిన మాట వినే పుత్రులు, ధనం ఇచ్చే విద్య – ఈ ఆరు మానవులకు ఆరు సుఖాలు సుమా!

అలాగే మితిమీరిన అహంకారం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, గొప్ప అపరాధాలు చేయడం, ఎప్పుడూ క్రోధంతో ఉండడం, సదా తన, తన కుటుంబం క్షేమం పట్ల మాత్రమే దృష్టి కలిగి ఉండడం, మిత్రద్రోహం – ఈ ఆరు తీక్షణమైన ఇనుప కత్తులు. మానవుని ఆయుర్దాయాన్ని భేదించేవి ఇవే.

ప్రభూ! వృద్ధులు, గురువులు లేనిదే సభ పూర్తికాదు. ధర్మం చెప్పలేని వారు గురువు కాదు, వృద్ధుడు కాడు. సత్యబద్ధం కాని పని ధర్మం కాదు. వాక్కును స్వాధీనంలో ఉంచుకోవడం కంటే ఉత్తమమైనది లేదు. వివేకవంతులు మితంగానే మాట్లాడుతారు” అని విదురుడు ఎన్నో నీతి వాక్యాలు బోధించాడు.

వీటిని బాగా అర్థం చేసుకొని, నిత్యజీవితంలో అనుసరించుకుంటే, మనఃక్లేశాలు ఉండవు. అంతా మన చేతిలోనే.

అనంతాత్మకుల రంగారావు