కరవు.. వ్యాపారులకు కల్పతరువు!
కరవు.. వ్యాపారులకు కల్పతరువు!
ప్రజల అవసరాలను లాభార్జనగా మార్చుతున్న వ్యాపార ధోరణి
కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలే పరిష్కారం
ప్రకృతి విపత్తు రైతులకు, సామాన్యులకు శాపం అయితే, అదే విపత్తు వ్యాపార వర్గాలకు వరంగా మారడం దురదృష్టకరం. ప్రకృతి వైపరీత్యాలను తమ లాభార్జనకు అనుకూలంగా మలచుకుంటున్న నయవంచకుల తీరు నేడు సమాజాన్ని కలవరపెడుతోంది. ఎల్నినో ప్రభావం రాష్ట్రం పై పెద్దగా పడకపోయినా వ్యాపారులు ఆహార ధాన్యాల ధరలను ముందే పెంచేస్తున్నారు. ఎల్నినో తీవ్ర రూపం దాల్చి, వర్షాభావం వల్ల పంటలు సరిగ్గా పండకపోతే, దాని ప్రభావం వచ్చే కొంత ఏడాది ఉంటుంది. గత రెండేళ్లుగా దిగుబడులు భారీగా వచ్చాయి. అవసరాలకు మించి నిల్వలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎఫ్సీఐ గోడౌన్లలో బియ్యం, గోధుమ నిల్వలు భారీగా ఉన్నాయి. 2026 ఏప్రిల్ నాటికి బియ్యం మరియు గోధుమ నిల్వలు సుమారు 604.02 లక్షల టన్నులు, బఫర్ స్టాక్ అవసరానికి మించి దాదాపు మూడు రెట్లు ఉన్నట్లు సమాచారం. కానీ కొందరు వ్యాపారులు ఇప్పుడే కరువు వచ్చేసినట్లు, దేశంలో, రాష్ట్రంలో గోడవున్లు ఖాళీ అయినట్లు, వరి నాట్లు పడనట్లు, ధాన్యం ఉత్పత్తి తగ్గినట్లు, బియ్యం నిల్వలు తరిగిపోయినట్లు బియ్యం ధరలు పెంచేసి సామాన్య, మధ్య తరగతి ప్రజలను దోపిడీ చేస్తున్నారు. లాభం కోసం వ్యాపారం చేయడం తప్పు కాదు. కానీ ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలతో ప్రజలను దండుకోవడం మాత్రం వ్యాపారం కాదు. దానిని దోపిడీ అంటారు. ఎల్‌నినో కారణంగా ఈ ఖరీఫ్ వరి సాగు తగ్గుతుందనే అంచనాతో కొంతమంది వ్యాపారులు బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంతో రకాన్ని బట్టి బియ్యం ధరను కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు పెంచారు. ఈ పరిణామాలతో బియ్యం ధరలపై ఆందోళన పెరుగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే బియ్యం ధరను క్వింటాకు రూ.1000 వరకు పెంచేశారు. ఏ రకం బియ్యమైనా 26 కిలోల బ్యాగ్‌కు రూ.250 నుండి రూ.350 వరకు పెంచేశారు. అంతేకాదు, ప్రజల దైనందిక ఆహార అవసరాల్లో భాగమైన పప్పులు, కూరగాయలు, పండ్లు, వంటనూనెలు, పశుగ్రాసం వంటి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతున్నారు.
బియ్యం ధరలు ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబ బడ్జెట్‌ను ప్రభావితం చేసే నిత్యావసర వస్తువు. కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు పెరిగినా ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకునే సామాన్యుడికి బియ్యం ధర పెరిగితే మాత్రం తప్పనిసరిగా అదనపు భారం మోయాల్సి వస్తుంది. బియ్యం ధరల పెరుగుదల సాధారణ పరిణామంగా చూడలేని అంశం. వ్యాపారం చేయడం తప్పు కాదు. లాభం పొందడం కూడా తప్పు కాదు. కానీ ప్రజల నిత్యావసరాన్ని అవకాశంగా మార్చుకుని అసాధారణ లాభాలు ఆర్జించడం మాత్రం ఆమోదయోగ్యం కాదు. వర్షాభావాన్ని సాకుగా చూపి వినియోగదారులపై అదనపు భారం మోపడం ఒక రకమైన ఆర్థిక దోపిడీ అవుతుంది. వర్షాభావం రైతు ఆదాయాన్ని దెబ్బతీస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది. ఇలాంటి సమయంలో వ్యాపారులు సమాజానికి అండగా నిలవాల్సింది పోయి కరువు పేరుతో ధరలు పెంచి లాభాలు దండుకోవడం అత్యంత బాధాకరం.
కరువు వచ్చినప్పుడు వ్యాపారులు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తించాలి. రైతు కష్టాన్ని గౌరవించాలి. వినియోగదారుడి నిస్సహాయతను అవకాశంగా చూడకూడదు. కరువు పరిస్థితుల్లో పంటల ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి తగ్గితే ధరల్లో కొంత మార్పు రావడం సహజమే. కానీ ఉత్పత్తి తగ్గిన దానికంటే ఎక్కువగా ధరలు పెంచడం, గోదాముల్లో సరుకు ఉన్నప్పటికీ మార్కెట్లో కొరత ఉన్నట్లు ప్రచారం చేయడం, సరుకులను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడం బాధ్యతారాహిత్యం. కాబట్టి ఇక్కడే ప్రభుత్వ నిఘా వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అనేక నిత్యావసర ఆహార వస్తువుల ధరలను ప్రతిరోజూ పర్యవేక్షించడం, ధరలు అసాధారణంగా పెరిగినప్పుడు బఫర్ స్టాక్ విడుదల చేయడం, నిల్వ పరిమితులు విధించాలి.
వర్షాభావ వార్తలు రాగానే వ్యాపారులు గోదాముల్లో నిత్యావసర సరకులను బియ్యం, పప్పులు, నూనెలు మొదలైనవి అక్రమంగా నిల్వ చేసి, మార్కెట్లో వీటికి డిమాండ్ ఉన్నట్లు నమ్మిస్తారు. అవసరానికి తగినట్లు సరుకు లేదని ధరలను రెట్టింపు చేస్తారు. పేద, మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయలేక పడుతున్న ఇబ్బందులను తమ లాభాల కోసం ఉపయోగిస్తారు.
మార్కెట్లపై ప్రభుత్వ యంత్రాంగం మరియు విజిలెన్స్ శాఖల పర్యవేక్షణ లోపించడం వల్ల దళారులు, అక్రమ నిల్వదారులు సులభంగా తమ దందాను సాగిస్తారు. ఎక్కడ ఏ వస్తువు కొరత ఉందనే విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయించగలుగుతున్నారు. సమాజంలో సంక్షోభం ఏర్పడినప్పుడు మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సింది పోయి, వ్యాపార లాభాలకే పెద్దపీట వేసే స్వార్థపూరిత ధోరణికి అడ్డుకట్ట వేయాలి. కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిపై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులు ఎప్పటికప్పుడు గోదాములు, మార్కెట్లను ఆకస్మిక తనిఖీలు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి. కరువు కాలంలో రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన సరుకులను తక్కువ ధరకు లేదా ఉచితంగా అందించడం ద్వారా ప్రజలకు రక్షణ కల్పించాలి. వ్యాపారుల అధిక ధరల ఆట కట్టించడానికి ప్రభుత్వాలు కఠినమైన నిల్వ నిరోధక చట్టాలను అమలు చేయాలి. గోదాముల్లో ఉన్న నిల్వలు, కొనుగోలు బిల్లులు, అమ్మకా రికార్డులు, ప్రకటిత ధరలు, వాస్తవ విక్రయ ధరలు పరిశీలించాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అసాధారణ ధరలపై ప్రశ్నించాలి. బిల్లులు తీసుకోవాలి. అనుమానాస్పద నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వ యంత్రాంగం మార్కెట్‌పై నిరంతర నిఘా పెట్టాలి. కాబట్టి కరువు వ్యాపారులకు కల్పతరువు కారాదు, కరువును క్యాష్ చేసుకునే వారిపై కొరడా ఝళిపించాలి…
– నీరుకొండ ప్రసాద్
