అమెరికాలో మృతి చెందిన యువకుడికి స్వగ్రామంలో అంతిమ వీడ్కోలు

విషాద వాతావరణంలో నిత్యానంద రెడ్డి అంత్యక్రియలు

లక్ష్మణచాంద్, ఆంధ్రప్రభ: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మణచాంద్ మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి (26) అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో విషాద వాతావరణంలో నిర్వహించారు.

నిత్యానంద రెడ్డి మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. ఇటీవలే ఉద్యోగంలో చేరిన ఆయన, ఈ నెల 18న మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు అంత్యక్రియలకు హాజరై నిత్యానంద రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్రు నరేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.