Sai-Krishna-Missing-Case : కొత్త మలుపు Andhra Prabha Crime News
Sai-Krishna-Missing-Case : కొత్త మలుపు Andhra Prabha Crime News
- మెజిస్టీరియల్ విచారణ షరూ ..
- సబ్ కలెక్టర్ ఎదుట తల్లి వాంగ్మూలం
- కీలక సమాచాం..ఆధారాలు, అందజేత
- కీలక నేతలు అంబటి , మల్లాది హాజరు
- పలు అనుమానాలు వ్యక్తం
( ఆంధ్రప్రభ విజయవాడ)

Sai-Krishna-Missing-Case : సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ కేసులో మెజిస్టీరియల్ విచారణ శనివారం విజయవాడలో ప్రారంభమైంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న విచారణకు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సహా మాజీ మంత్రి అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, వంగవీటి నరేంద్ర, సుధాకర్ బాబు హాజరై తమ వాదనలు, సమాచారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం ఆదేశించిన మెజిస్టీరియల్ విచారణ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైంది. విచారణలో భాగంగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరై, కేసు ప్రారంభం నుంచి జరిగిన పరిణామాలను సబ్ కలెక్టర్‌కు వివరించారు. తన వద్ద ఉన్న ఆధారాలు, ఇతర కీలక సమాచారాన్ని కూడా అధికారులకు సమర్పించారు. ఈ విచారణకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, వంగవీటి నరేంద్ర, సుధాకర్ బాబు హాజరయ్యారు.

కేసుకు సంబంధించి తమకు ఉన్న అనుమానాలు, అభ్యంతరాలను వివరిస్తూ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. మెజిస్టీరియల్ విచారణలో బాధిత కుటుంబ సభ్యులు, సంబంధిత వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు, ఆధారాలను అధికారులు స్వీకరిస్తున్నారు. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
నా బిడ్డ బూడిద ఇవ్వండి : తల్లి ఆవేదన

తన కుమారుడి మరణానికి పూర్తి నిజాలను బయటపెట్టాలని
సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మీ కోరారు. తన కుమారుడి భస్మాన్ని తనకు అప్పగించాలని, కేసులో కారకులందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారితో మాత్రమే కేసును పరిమితం చేయకుండా, తన కుమారుడిని ఇంటి నుంచి తీసుకెళ్లిన వారితో సహా అందరిపై విచారణ జరపాలని అన్నారు. తన కుమారుడు నేరస్థుడు కాదని, నిజాలు వెలుగులోకి రావాలని కోరారు. ఈ విచారణకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, వంగవీటి నరేంద్ర, సుధాకర్ బాబు హాజరయ్యారు. తమ అనుమానాలను వినతిపత్రం రూపంలో అధికారులకు అందజేస్తూ పలు ఆరోపణలు చేశారు.

అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఇది పోలీసుల ప్రమేయంతో జరిగిన హత్య అని ఆరోపించారు. కేసులో ఆధారాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరిగాయని, డెడ్‌బాడీకి సంబంధించిన అంశాలపైనా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, వాస్తవాలు బయటకు వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసులో ఒక్కరినే నిందితుడిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టాస్క్‌ఫోర్స్ పాత్రపైనా తమకు అనుమానాలు ఉన్నాయని, వాటిని కూడా విచారణలో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
