ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు
- కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
- మైలవరం ఎమ్మెల్యే వసంత సూచన
- విద్యార్థుల ప్రతిభకు నగదు ప్రోత్సాహం
- 118 మందికి రూ.6.20 లక్షలు పంపిణీ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. మూలపాడు అటవీశాఖ నగర వనంలో బుధవారం “బ్రేక్‌ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే” కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గంలోని 35 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 118 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను దుశ్శాలువాలతో సత్కరించి, రూ.6.20 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రత, పట్టుదలతో చదివి తమ కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రతి ఏడాది ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు. నేటి బాలలే రేపటి భారత భవిష్యత్తని, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. సాంకేతికతను, సామాజిక మాధ్యమాలను మంచి పనుల కోసం మాత్రమే వినియోగించాలని, సెల్‌ఫోన్ యుగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని సద్వినియోగం చేసుకుంటే విజ్ఞానం పెరుగుతుందని చెప్పారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు జీవితంలో గొప్ప విజయాలు సాధించేందుకు ఎన్టీఆర్ జీవితం స్ఫూర్తిగా నిలవాలని, పేద కుటుంబంలో జన్మించి ప్రజల కోసం అంకితభావంతో పనిచేసి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే వసంత సూచించారు. అలాగే “కలలు కనండి… వాటిని సాకారం చేసుకునేలా కష్టపడండి” అని యువతకు పిలుపునిచ్చిన భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఆశయాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. తొలుత విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి ఆత్మీయంగా ముచ్చటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే తండ్రి వసంత నాగేశ్వరరావు 80వ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), టీడీపీ మండల అధ్యక్షుడు పెదర్ల రవి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
