బీమా పధకం గడువు పెంచాలి…
రైతు సంఘ మండల కార్యదర్శి మోహన్ చంద్
శావల్యాపురం, జులై 29 (ఆంధ్రప్రభ) : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు పొడిగించాలని రైతు సంఘం మండల కార్యదర్శి కెవిఆర్ మోహన్ చంద్ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన శావల్యాపురం రైతు సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తీవ్రమైన ఎలీనోవా పరిస్థితుల నేపథ్యంలో మండలంలోని రైతులు ఇప్పటి వరకు ఎటువంటి పైరు సాగు చేయనందున బీమా పథకాన్ని ఆగస్టు 30వ తేదీ వరకు గడువును పొడిగించాలన్నారు.
వర్షాలు కురవక, సాగునీరు లేక రైతులు ఏమి చేయాలో పాలుపోనీ స్థితిలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో జూలై 31 వరకు మాత్రమే గడువు పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రస్తుత రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బీమా గడువులను పొడిగించాలని, అవసరమైతే ప్రభుత్వమే బీమా డబ్బులు చెల్లించాలని కోరారు. కార్పొరేట్లకు వేలాది రూపాయలు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు రైతులకు భీమా ఎందుకు చెల్లించదని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతు ధరలు రైతులకు ఎలాగూ ఉపయోగపడటం లేదని, గత రబీ సీజన్లో మొక్కజొన్న రైతులు మద్దతు ధరకు అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వాలు ఆలకించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు రైతు సంఘ నాయకులు గణపర్తి వెంకటేశ్వర్లు, దుగ్గెంపూడి చిన్న వెంకయ్య తదితరులు ఉన్నారు.
