కిన్నెరసాని వాగు వద్ద పరిస్థితుల పరిశీలన
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
బంధాల సర్పంచ్ శ్రీలత ప్రశాంత్
తాడ్వాయి, ఆంధ్రప్రభ: మండలంలోని పోచాపూర్ గ్రామం వద్ద ప్రవహిస్తున్న కిన్నెరసాని వాగు వరద ఉధృతిని బంధాల గ్రామ సర్పంచ్ ముకిడి శ్రీలత ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి అజ్మీర్ ధర్మేందర్ బుధవారం పరిశీలించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని పరిస్థితులను వారు స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు ప్రమాదకరంగా మారుతున్నాయని, అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే గ్రామపంచాయతీ లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సర్పంచ్ ముకిడి శ్రీలత ప్రశాంత్ ప్రజలను కోరారు.
