ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యం: ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, ఆంధ్రప్రభ: కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతంలో శనివారం ఉదయం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, పోలీసు-ప్రజల మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, రెండు కార్లను పరిశీలించారు. వీటిలో 11 వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఒక తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.

సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లు వంటి మారణాయుధాలతో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి యువతను రెచ్చగొట్టేలా లేదా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన, స్నేహాలు, రోజువారీ అలవాట్లను గమనించాలని సూచించారు. గంజాయి వ్యసనానికి గురైన వారి గురించి సమాచారం అందిస్తే డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీసు శాఖ సహకరిస్తుందని తెలిపారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, కేవైసీ, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలకు గురికావద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
ప్రజల సమాచారం నేరాల ఛేదనలో కీలకమని పేర్కొంటూ, కామారెడ్డి జిల్లాలో ఇటీవల ఛేదించిన పలు దొంగతన కేసుల్లో ప్రజలు అందించిన సమాచారం కీలకపాత్ర పోషించిందన్నారు. కాలనీలు, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, గంజాయి లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థ వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి నేరాల నియంత్రణతో పాటు నిందితులను గుర్తించడంలో ఉపయోగపడతాయని వివరించారు.
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో అనుమానితులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, జీవనశైలిని తెలుసుకున్నారు. నేరాలకు దూరంగా ఉండి మంచి ప్రవర్తన కనబరిస్తే చట్టపరమైన నిబంధనల మేరకు షీట్ల తొలగింపును పరిశీలిస్తామని తెలిపారు. అలాగే కరాటేలో ప్రతిభ కనబరిచిన యువతను అభినందించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్హెచ్ఓ నరహరి, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, బిక్కనూర్ ఇన్స్పెక్టర్ నరేష్, ఆర్ఐలు సంతోష్, నవీన్, కృష్ణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
