కరువు రైతును కాపాడాలి…

పంట బీమా నమోదు గడువు ఆగస్టు 31 వరకు పొడిగించాలి
ప్రభుత్వానికి రైతు సంఘం డిమాండ్


శ్రీ సత్యసాయి బ్యూరో, జులై 29 (ఆంధ్రప్రభ ): వరుస కరువు పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీ సత్యసాయి జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఉచిత పంట బీమా నమోదు గడువును ఈ నెలాఖరుతో ముగించకుండా ఆగస్టు 31 వరకు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లం మహదేవ్ డిమాండ్ చేశారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఏటా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల భారంతో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులతో పాటు ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న రైతులు కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు.

పంట బీమా నమోదు కోసం మీ-సేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్న రైతులు సాంకేతిక సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నమోదు ప్రక్రియలో జాప్యం వల్ల అర్హులైన రైతులు బీమా సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో అనేక మంది రైతులు ఇంకా విత్తనాలు వేయకుండా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

జిల్లాలో ఇప్పటికే స్పష్టమైన కరువు పరిస్థితులు నెలకొన్నందున రైతులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉచిత పంట బీమా నమోదు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలని ఆయన కోరారు. అలాగే కరువు ప్రభావిత రైతులకు తక్షణ ఆర్థిక సహాయం, పంట నష్టాల అంచనా, ఇన్‌పుట్ సబ్సిడీ, తాగునీరు, పశుగ్రాసం వంటి అత్యవసర సహాయక చర్యలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది.