సదర్ మాట్‌కు పెరుగుతున్న వరద నీరు..

  • ఎగువ ప్రాంతాల వర్షాలతో నీటిమట్టం ఎనిమిది అడుగులకు చేరిక
  • గోదావరి పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక

ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం ప్రాంత రైతాంగానికి ప్రధాన సాగునీటి వనరైన సదర్ మాట్ అనికట్‌కు గత రెండు రోజులుగా వరద నీరు స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో నీటి ప్రవాహం పెరుగుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

సదర్ మాట్ అనికట్ పూర్తి సామర్థ్యం 12 అడుగులు కాగా, ప్రస్తుతం 8 అడుగుల నీటిమట్టం నమోదైంది. అదనంగా వస్తున్న నీరు అడ్డుగోడపై నుంచి సుమారు ఐదు అంగుళాల మేర గోదావరిలోకి ప్రవహిస్తోందని అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో సదర్ మాట్ వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో పశువుల కాపరులు, మత్స్యకారులు, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు.