గురువు స్థానం దైవం కంటే గొప్పది: సూఫీ ఖాజా మొహిద్దీన్

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ: ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలోని శ్రీ శివదత్త సాయి మందిరాన్ని బుధవారం ఎ.కొండూరు మండలం చీమలపాడు ఏఏంటీకే దర్బార్, బాబే బొగ్దాద్ షరీఫ్ పీఠాధిపతి, సజ్జదా నషీన్, పీర్జాదా, సూఫీ మొహమ్మద్ ఖాజా మొహిద్దీన్ షా తాజ్ ఖాదరీ బాబా భక్తులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గురు పౌర్ణిమ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో మందిరానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామంలో పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన సత్కార కార్యక్రమంలో పీఠాధిపతి సూఫీ ఖాజా మొహిద్దీన్ షా తాజ్ ఖాదరీ బాబాతో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు దుర్వాసుల రామారావు, కోలాటం గురువు పొన్నగంటి ఉషారాణిలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

మందిర నిర్మాణకర్తలు, ప్రవాస భారతీయులు గుంటక సుదర్శన్ రెడ్డి (అమ్ములు), హేమలత దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 1,500 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పీఠాధిపతి సూఫీ ఖాజా మొహిద్దీన్ షా తాజ్ ఖాదరీ బాబా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, గురు పౌర్ణిమ భారతీయ సంస్కృతిలో గురువుకు కృతజ్ఞతలు తెలిపే అత్యంత పవిత్రమైన రోజని అన్నారు. మనకు జ్ఞానం, సంస్కారం, సన్మార్గాన్ని చూపించే గురువు స్థానం దైవం కంటే గొప్పదని పేర్కొన్నారు. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహనీయుడు గురువని వివరించారు.

మహర్షి వేదవ్యాసుని జయంతిని పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణిమను జరుపుకుంటారని తెలిపారు. వేదాలను విభజించి, మహాభారతం, పురాణాలను రచించిన వేదవ్యాస మహర్షిని జగద్గురువుగా స్మరిస్తూ ఈ పర్వదినాన్ని ఆచరిస్తారని చెప్పారు.

సూఫీ సంప్రదాయంలో కూడా ఆధ్యాత్మిక గురువుకు విశిష్ట స్థానం ఉందని, గురువు చూపిన మార్గంలో నడవడం ద్వారా మానవుడు ప్రేమ, శాంతి, సేవాభావం, సత్యనిష్ఠ వంటి విలువలను అలవర్చుకుంటాడని పేర్కొన్నారు. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించి, వారి బోధనలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. అనంతరం మందిరంలో భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు సేవాదళ్, భజన సమాజ సభ్యులు, వి. బాలాజీ ప్రసాద్, కె. సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.