వర్షంలోనూ విధుల్లోనే విద్యుత్ సిబ్బంది
జోరు వానలోనూ సేవలు కొనసాగించిన విద్యుత్ ఉద్యోగులపై ప్రశంసలు
మంథని రూరల్, ఆంధ్రప్రభ: మంథని మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది తమ విధులను నిరంతరం నిర్వహిస్తూ సేవలందిస్తున్నారు.
బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసినా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేశారు.
మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో ఆన్మ్యాన్ తిరుపతి, అసిస్టెంట్ లైన్మన్ రఘు జోరు వర్షాన్ని లెక్కచేయకుండా విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం వారు చేసిన కృషి స్థానికులను ఆకట్టుకుంది.
వర్షంలో తడుస్తూనే విధి నిర్వహణలో నిమగ్నమైన విద్యుత్ సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు వారి అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
