Prime Minister Modi |’విక్రమ్-1′ విజయంపై అభినందనలు..

స్కైరూట్ వ్యవస్థాపకులతో భేటీ..

అంతరిక్ష రంగ భవిష్యత్‌పై చర్చ


Prime Minister Modi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ చందన, నాగ భరత్ డాకా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారతదేశపు తొలి ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగం అనంతరం ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

భేటీ అనంతరం ప్రధాని మోదీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో స్పందిస్తూ.. “పవన్ చందన, నాగ భరత్ డాకాలతో అద్భుతమైన సంభాషణ జరిగింది. విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగంపై వారిని అభినందించాను” అని పేర్కొన్నారు.

విక్రమ్-1 ప్రయోగం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అంతరిక్ష సాంకేతికత, ఆవిష్కరణలు, యువ పారిశ్రామికవేత్తల పాత్ర, భవిష్యత్తులో భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై కూడా విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

స్కైరూట్ ఏరోస్పేస్ విజయాన్ని దేశానికి గర్వకారణంగా పేర్కొంటూ, అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో మరిన్ని విజయాలు సాధించే దిశగా ఈ భేటీ కీలకంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.