విద్యాభివృద్ధికి ఫౌండేషన్ సహకారం అభినందనీయం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

ఊట్కూర్, ఆంధ్రప్రభ: విద్యాభివృద్ధికి స్నేహ ఫౌండేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని మల్లేపల్లి సర్పంచ్ కతలప్ప అన్నారు.

మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని మల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు సామాజిక సంస్థలు ముందుకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు.

విద్యార్థులు అందించిన నోటు పుస్తకాలను సద్వినియోగం చేసుకొని బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, ప్రధానోపాధ్యాయుడు బాలు, ఉపాధ్యాయ బృందం, ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.