గుడివాడలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం..
- పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
గుడివాడ, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా గుడివాడలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం పురపాలక శాఖ సిద్ధం చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను వర్చువల్ గా ఆవిష్కరించారు. ఇంటింటికీ చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన ఇ-ఆటోలను ప్రారంభించారు.

రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 8 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ప్రారంభించగా, నెల్లూరు, కొండపల్లి, బేతంచర్ల, కమలాపురం, బద్వేల్, ఏలేశ్వరం, నర్సీపట్నం, పెద్దాపురంలో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో వర్చువల్ గా మాట్లాడి స్వచ్ఛాంధ్ర సాధనకు మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు.

అనంతరం ప్రజావేదిక సమీపంలో ఆన్ లైన్ వర్క్స్ మానిటరింగ్ సిస్టమ్ ను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్మా మహిళా సంఘాలు తయారు చేసి ప్రదర్శించిన ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కింద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను చూసి అభినందనలు తెలిపారు. ఓ స్టాల్ వద్ద వెదురుతో తయారు చేసిన టోపీని ధరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు పి,నారాయణ, కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.

