రూ.3 కోట్లతో బంధం చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
- తీగల వంతెన నిర్మాణం..
- అదనపు నిధులు కూడా తీసుకొస్తాం..
- ప్రభుత్వ విప్ విజయరమణరావు..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ రూ.3 కోట్ల వ్యయంతో పెద్దపల్లి బంధం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, సంబంధిత అధికారులతో కలిసి మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ, పెద్దపల్లి ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రాన్ని అందించాలనే లక్ష్యంతో బంధం చెరువు కట్టను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. చెరువు అందాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక ఆకర్షణగా తీగల వంతెన (సస్పెన్షన్ బ్రిడ్జి) నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దీనికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు. చెరువు కట్ట అభివృద్ధికి అవసరమైతే అదనపు నిధులు కూడా తీసుకొస్తామని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, పెద్దపల్లి పట్టణాన్ని దశలవారీగా సర్వాంగసుందరంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని విజయరమణరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, స్థానిక కౌన్సిలర్ పూరెళ్ల శైలజ సుధాకర్, సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
