వర్షాభావంలో వరికి బదులు ఆరుతడి పంటలను సాగు చేయాలి..

చిన్న గురజాలలో రైతులకు అవగాహన సదస్సు
సర్పంచ్ రాగిరి కమలాకర్ అధ్యక్షతన కార్యక్రమం,* *వ్యవసాయ విస్తరణ అధికారి మెండు అశోక్ సూచనలు

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ విస్తరణ అధికారి మెండు అశోక్ సూచించారు. శుక్రవారం చిన్న గురజాల గ్రామంలో సర్పంచ్ రాగిరి కమలాకర్ అధ్యక్షతన నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమయ్యే పంటల సాగు కంటే తక్కువ వర్షపాతంతోనూ మంచి దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా రైతులు నష్టాలను నివారించవచ్చని తెలిపారు. జూన్ చివరి వారంలో విత్తుకునేందుకు కంది, పెసర, మినుము, జొన్న, ఆముదం వంటి పంటలు అత్యంత అనుకూలమని వివరించారు. తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎల్‌ఆర్‌జీ-41, పీఆర్‌జీ-158, ఆశా వంటి కంది రకాలు, ఎంజీ-613, ఎల్‌జీజీ-450, పూస వైశాఖి పెసర రకాలు, పీయూ-31, ఎల్‌బీజీ-752 మినుము రకాలు, తెలంగాణ జొన్న-1, సీఎస్‌వీ-27 జొన్న రకాలు, పీసీ-1, క్రాంతి, హరిత ఆముదం రకాలు సాగుకు అనువైనవని చెప్పారు.

వర్షాధార పరిస్థితుల్లో కంది అత్యుత్తమ ప్రత్యామ్నాయమని, పెసర తక్కువ కాలంలో దిగుబడినిస్తుందని, మినుము ఎర్ర నేలలు, నల్లరేగడి నేలల్లో బాగా పండుతుందని వివరించారు. జొన్న కరువును తట్టుకోవడంతో పాటు పశువులకు మేతగా కూడా ఉపయోగపడుతుందని, ఆముదం లోతైన వేర్ల ద్వారా నేలలోని తేమను గ్రహించి వర్షాభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు. రైతులు విత్తనాలు వేయడానికి ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేపట్టాలని, భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తుకోవాలని సూచించారు. తమ భూమి స్వభావం, నీటి వసతి ఆధారంగా పంటలను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.
ఈ అవగాహన సదస్సులో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పంటల ఎంపిక, విత్తన రకాలు, సాగు విధానాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సర్పంచ్ రాగిరి కమలాకర్ రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటించి వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని నష్టాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.