BRS Yuva Sangrama Sabha | రేపు బీఆర్‌ఎస్ ‘యువ సంగ్రామ సభ’

సరూర్‌నగర్‌లో నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైన గులాబీ శ్రేణులు
ప‌ర్మిష‌న్ ఇవ్వ‌ని పోలీసులు
అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు పార్టీ సిద్ధం

BRS Yuva Sangrama Sabha | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోరుతూ బీఆర్‌ఎస్ శుక్రవారం (జులై 18) హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ‘యువ సంగ్రామ సదస్సు’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానుండగా, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ‘చలో సరూర్‌నగర్’ కార్యక్రమంలో పాల్గొనాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. అయితే, సభ నిర్వహణకు ఇప్పటివరకు పోలీసుల నుంచి అధికారిక అనుమతి లభించలేదు. దీంతో అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ భవన్‌లో సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు.

మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేసేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు, విద్యాశాఖల్లో కలిపి దాదాపు 40 వేల ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ ప్రక్రియ చేపట్టలేదని ఆమె ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కోరుతున్న యువతపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్యే డి. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించగా, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఇచ్చిన హామీల అమలే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు.