విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నందగిరి వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, హెల్మెట్ వినియోగం యొక్క ప్రాధాన్యతపై వివరంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని సూచించారు. చిన్న వయస్సులో వాహనాలు నడపడం ప్రమాదకరమని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ట్రాఫిక్ ఎస్సై, ఆర్‌ఎస్సైలు, స్థానిక సర్పంచ్ కాకి శ్రీలత సుందర్, రోడ్డు భద్రత కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.