ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
- జిల్లా కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్..
- నాగర్కర్నూల్ పురోగతిని వివరించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధుల నివారణ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల నమోదు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలు, రైతులకు పంటలపై అవగాహన, ప్రజాపాలన కార్యక్రమాల అమలు తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, ప్రజాసేవల రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో నాగర్కర్నూల్ జిల్లా తరఫున పాల్గొన్న జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ జిల్లాలో వివిధ శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ఇప్పటికే మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు.
నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. అలాగే తెలంగాణ మోడల్ స్కూల్ల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం కింద అందిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించేలా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణ రెడ్డి, జిల్లా విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
