అనవసరమైన కెమెరా యాంగిల్స్, స్లో-మోషన్ షాట్లు వద్దు…
- మహిళా అథ్లెట్ల ప్రసారాలకు కొత్త మార్గదర్శకాలు
- లైంగికీకరణకు దారితీసే కెమెరా యాంగిళ్లకు చెక్..
- గౌరవప్రద ప్రసారాలపై ఈబీయూ ప్రత్యేక గైడ్
ఆంధ్రప్రభ : మహిళా అథ్లెట్లను ప్రసారం చేసే సమయంలో వారి ప్రతిభ, క్రీడా నైపుణ్యాన్ని ముందుకు తీసుకురావాలని, అనవసరంగా శరీర భాగాలపై దృష్టి సారించే కెమెరా యాంగిళ్లను నివారించాలని యూరోపియన్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ (ఈబీయూ) అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది. “రైజింగ్ ది బార్” పేరుతో రూపొందించిన ఈ గైడ్లో మహిళల అథ్లెటిక్స్ పోటీలను గౌరవప్రదంగా ఎలా చిత్రీకరించాలనే అంశాన్ని విపులంగా వివరించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజా ప్రసార సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈబీయూకు 56 దేశాల్లో 113 సభ్య సంస్థలు ఉండగా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాల్లో మరో 31 అనుబంధ సంస్థలు ఉన్నాయి. మహిళా క్రీడాకారిణులపై టెలివిజన్ ప్రసారాల్లో కనిపించే అనుచిత కెమెరా యాంగిల్స్, అవసరం లేని స్లోమోషన్ దృశ్యాలు, శరీరాన్ని లైంగికంగా చూపించే చిత్రీకరణ వంటి అంశాలపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

2024 ఒలింపిక్స్ తర్వాత కీలక నిర్ణయం
2024 పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఒలింపిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అధికారులు మహిళా, పురుష అథ్లెట్లను ఒకే విధంగా చిత్రీకరించాలని, ప్రసారాల్లో లింగ వివక్ష లేదా మూస ధోరణులు కనిపించకుండా చూడాలని కెమెరా బృందాలకు సూచించారు. అదే దిశగా ఇప్పుడు ఈబీయూ మరింత స్పష్టమైన ఉదాహరణలతో ఈ గైడ్ను రూపొందించింది.
ఎలాంటి యాంగిళ్లు వద్దంటే?
పోల్ వాల్ట్, హైజంప్, లాంగ్ జంప్, రన్నింగ్ ఈవెంట్లలో కెమెరాలను ఎక్కడ ఉంచాలి, ఏ కోణాలు క్రీడా సాంకేతికతను బాగా చూపిస్తాయి, ఏవి క్రీడాకారిణులను ఇబ్బందికరంగా చూపిస్తాయో చిత్రాలతో వివరించింది.
అవసరం లేని లో-యాంగిల్ కెమెరాలు, శరీర భాగాలపై ఎక్కువసేపు నిలిచిపోయే షాట్లు, సాంకేతిక అవసరం లేకుండా పదేపదే స్లోమోషన్లో ప్రసారం చేసే దృశ్యాలను నివారించాలని సూచించింది. పరిస్థితులకు అనుగుణంగా గౌరవప్రదమైన చిత్రీకరణే లక్ష్యమని ఈబీయూ స్పష్టం చేసింది.
మహిళా అథ్లెట్ల భాగస్వామ్యంతో తయారీ
ఈ మార్గదర్శకాలను రూపొందించడంలో ఒలింపిక్ అథ్లెట్లు హాలీ బ్రాడ్షా, ఇవానా స్పానోవిచ్, బ్లాంకా వ్లాసిచ్ పాల్గొన్నారు. పోటీల సమయంలో తమ ప్రతిభను సరైన రీతిలో ప్రతిబింబించే కెమెరా యాంగిళ్లు ఏవో, అసౌకర్యం కలిగించే దృశ్యాలు ఏవో తమ అనుభవాలను పంచుకున్నారు. పోల్ వాల్టర్ హాలీ బ్రాడ్షా మాట్లాడుతూ, పోటీల్లో తీసిన కొన్ని స్లోమోషన్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో దుర్వినియోగం చేసి తనతో పాటు ఇతర మహిళా అథ్లెట్లను వేధించిన ఘటనలు ఎదురయ్యాయని తెలిపారు. తాము ఇష్టపడే క్రీడను భయపడకుండా, అసౌకర్యం లేకుండా ఆడే హక్కు ప్రతి అథ్లెట్కు ఉండాలని ఆమె పేర్కొన్నారు.
ప్రేక్షకుల విశ్వాసాన్ని కాపాడాలి…
ఈబీయూ స్పోర్ట్ కార్యనిర్వాహక సంచాలకుడు గ్లెన్ కిల్లేన్ మాట్లాడుతూ, ప్రసారాల్లో మహిళా అథ్లెట్లను వారి నైపుణ్యం, కష్టపడి సాధించిన విజయాలు, క్రీడా ప్రతిభ ఆధారంగానే చూపించాలని అన్నారు. శరీరాన్ని లైంగికంగా చూపించే కెమెరా కోణాలు ఇప్పటికీ అనేక క్రీడా ప్రసారాల్లో కనిపిస్తున్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.

