కవ్వాలలో టైగర్ లేదు.. నేనే టైగర్..!

నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రిని..!! … ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : కవ్వాల్ టైగర్ జోన్ అడవుల్లో టైగర్ లేదని, తానే టైగర్‌నని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వ్యాఖ్యానించారు. కొత్త పుట్టిగూడలో నిలిచిపోయిన సీసీ రోడ్డు పనులను పూర్తిచేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

మంచిర్యాల జిల్లా జన్నారం హరిత రిసార్టులో గురువారం సాయంత్రం కొత్త పుట్టిగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను వివరించారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్, రోడ్డు నిర్మాణం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన సీసీ రోడ్డు పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది అటవీ అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అజ్మీర నందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.