వరికి బదులు ఆయిల్‌ఫామ్..
- తక్కువ నీటితో అధిక లాభం..
- నాలుగు ఎకరాల్లో రూ.3.65 లక్షల ఆదాయం
- ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు రావాలి
- కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
అచ్చంపేట, ఆంధ్రప్రభ: వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో పరిమిత నీటి నిల్వల నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా ఆయిల్‌ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే తక్కువ నీటితోనే అధిక ఆదాయం పొందవచ్చని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అన్నారు.
గురువారం అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు రాజశేఖర్ గౌడ్ నాలుగు ఎకరాల్లో సాగు చేసిన ఆయిల్‌ఫామ్ తోటను ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆయిల్‌ఫామ్ సాగుకు పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని లాభదాయకమైన పంటల వైపు అడుగులు వేయాలని సూచించారు. విజయవంతంగా ఆయిల్‌ఫామ్ సాగు చేస్తున్న రైతు రాజశేఖర్ గౌడ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు.
రైతు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, నాలుగేళ్ల క్రితం నాలుగు ఎకరాల్లో నాటిన ఆయిల్‌ఫామ్ తోట నుంచి ఈ ఏడాది తొలిసారిగా 16 టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం రూ.3.65 లక్షలకు పైగా ఆదాయం లభించిందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ఉపయోగించడం వల్ల తక్కువ నీటితోనే మెరుగైన దిగుబడి సాధించినట్లు వివరించారు.
ఈ విజయాన్ని చూసి మరో 30 ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగు చేసేందుకు పలువురు రైతులు ముందుకు రావడం సంతోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు. వారికి అవసరమైన సాంకేతిక సహాయం, ఇతర సదుపాయాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్ ఉద్యాన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.
