కొనుగోళ్లలో జాప్యంపై మక్క రైతుల ఆందోళన

కొనుగోళ్లలో జాప్యంపై మక్క రైతుల ఆందోళన
తొర్రూరు, ఆంధ్రప్రభ: మొక్కజొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని మండల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. నెల రోజులు గడిచినా ఇంతవరకు మక్కలు కొనుగోలు చేయడం లేదని, వర్షాలతో మొక్కజొన్నలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మక్కలను కొనుగోలు చేసేంతవరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. మక్కల కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు మద్దతు ధర లేక నష్టపోతుంటే మరోవైపు అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిచి నష్టం వాటిల్లుతుందని వాపోయారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని సంచులు లేకపోవడంతో రైతులే సొంతంగా కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
వెంటనే మొక్కల కొనుగోలును చేపట్టి రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడుతావని తెలిపారు. ఆందోళన చేస్తున్న సంఘటన స్థలాన్ని అదనపు ఎస్సై లు అంజమ్మ, ఖాదర్ పాషా లు చేరుకొని రైతులతో మాట్లాడారు. లారీలు సమకూర్చేలా ధాన్యం కొనుగోలు చేసే విధంగా అధికారులతో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
