ఆ ప్లేయ‌ర్ పై ఐసీసీ సీరియ‌స్ !

  • ప్రమాదకరంగా బంతి విసిరినందుకు డిమెరిట్ పాయింట్
  • ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు ఐసీసీ చర్య
  • డకెట్‌పై బంతి విసిరిన ఘటనపై కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన

ఆంధ్రప్రభ : ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు ముందు టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరిక జారీ చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌పై ప్రమాదకరంగా బంతి విసిరిన ఘటనపై గుర్నూర్ బ్రార్‌కు ఒక డిమెరిట్ పాయింట్ విధించింది. అయితే, ఎలాంటి మ్యాచ్ నిషేధం లేదా జరిమానా విధించలేదు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ తేల్చారు. అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా ఆటగాడిపై అనుచితంగా లేదా ప్రమాదకరంగా బంతి విసరడాన్ని ఈ నిబంధన ఉల్లంఘనగా పరిగణిస్తారు.

అస‌లేం జరిగింది?

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి వన్డేలో బెన్ డకెట్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతిని తన ఫాలోత్రూ‌లో అందుకున్న బ్రార్.. కోపంతో డకెట్ వైపు బంతిని బలంగా విసిరాడు. డకెట్ సమయానికి తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనను పరిశీలించిన మ్యాచ్ రిఫరీ బ్రార్‌ను తప్పుబట్టారు. తన తప్పును బ్రార్ అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే ఐసీసీ హెచ్చరికతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ నమోదు చేసింది.

అయినా జట్టుకు కీలక ఆటగాడే

తొలి వన్డేలో ఆరంభంలో డకెట్ చేతిలో పరుగులు సమర్పించుకున్న గుర్నూర్ బ్రార్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. కీలక సమయంలో బెన్ డకెట్, జేకబ్ బెతెల్ వికెట్లు తీసి భారత్‌కు బ్రేక్‌థ్రూ అందించాడు. అతని స్పెల్‌తో ఇంగ్లండ్ మధ్యవరుసపై ఒత్తిడి పెరిగి, భారత్ భారీ విజయానికి బాటలు పడ్డాయి.

రెండో వన్డేలోనూ కీలక బాధ్యత

కార్డిఫ్‌లో జరిగే రెండో వన్డేలో కూడా గుర్నూర్ బ్రార్ భారత బౌలింగ్ దళంలో కీలక పాత్ర పోషించనున్నాడు. కొత్త బంతితో వేగం, బౌన్స్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే సామర్థ్యం అతనికి ఉండటంతో మరోసారి అతడిపైనే భారత జట్టు ఆశలు పెట్టుకుంది.