Amazon | వేలాది ఉద్యోగాలకు అవకాశం..

రూ.60 వేల కోట్ల పెట్టుబడితో ఏఐ, క్లౌడ్ డేటా సెంటర్‌కు శ్రీకారం..
శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌ను గ్లోబల్ డిజిటల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా భారీ ప్రాజెక్ట్..

Amazon | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో మరో భారీ పెట్టుబడి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వద్ద రూ.60 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనున్న ఈ ప్రాజెక్టును అమెజాన్ సంస్థ దశలవారీగా అభివృద్ధి చేయనుంది. రాబోయే 10 నుంచి 12 ఏళ్లలో మొత్తం రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాలు, చందన్‌వెల్లిలో 98 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది.

మొదటి దశ నిర్మాణ పనులను 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం మిగిలిన దశలను వచ్చే పదేళ్లలో దశలవారీగా విస్తరించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ రంగాలకు అవసరమైన అత్యాధునిక డిజిటల్ మౌలిక వసతులను ఈ డేటా సెంటర్ అందించనుంది. ఈ ప్రాజెక్ట్‌తో హైదరాబాద్ దేశంలోనే కీలకమైన డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రంగా ఎదుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

అమెజాన్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణను టెక్నాలజీ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా మారనుందని పేర్కొన్నారు.

https://twitter.com/i/broadcasts/1DGleermEqgJL