సింగరేణిని కాపాడింది బీజేపీయే..

భట్టి విక్రమార్క వాస్తవాలు గుర్తు చేసుకుని మాట్లాడాలి: చందుపట్ల సునీల్‌రెడ్డి

మంథని (ఆంధ్రప్రభ): సింగరేణి భవిష్యత్తు, కార్మికుల సంక్షేమం, మంథని అభివృద్ధే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘సింగరేణి భరోసా యాత్ర’ ప్రజల్లో కొత్త ఆశలను నింపిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు. మంథనిలోని రామ్‌రెడ్డి కాంప్లెక్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ యాత్ర సింగరేణి కార్మికులకు, మంథని ప్రజలకు భరోసా కల్పించిందన్నారు. బొగ్గు, గోదావరి జలాలు, ఇసుక వంటి అపార సహజ వనరులు ఉన్నప్పటికీ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లేక మంథని అభివృద్ధిలో వెనుకబడిపోయిందని పేర్కొన్నారు.

సింగరేణిలో ఒకప్పుడు లక్షా నలభై వేల నుంచి లక్షా యాభై వేల మంది వరకు ఉద్యోగులు పనిచేసేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 35 వేలకే పరిమితమైందని తెలిపారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల విధానాలే కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉన్నప్పటికీ సింగరేణిని బలోపేతం చేయకుండా ఆదాయ వనరుగా మాత్రమే ఉపయోగించుకుందని విమర్శించారు. జెన్‌కోతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల సంస్థపై ఆర్థిక భారం పెరిగి, కార్మికుల జీతాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లపై ప్రభావం పడిందన్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2013 తర్వాత జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుని మాట్లాడాలని సునీల్‌రెడ్డి సూచించారు. బొగ్గు గనుల కేటాయింపుల అంశంలో సుప్రీంకోర్టు జోక్యం తర్వాత కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల బ్లాక్–2ను ఎలాంటి ప్రైవేట్ టెండర్లు లేకుండా నేరుగా సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కేటాయింపులో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. తాడిచెర్ల బ్లాక్–2 ద్వారా మైనింగ్, అనుబంధ పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పడి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, మంథని పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.

ఏఎమ్మార్ సంస్థ స్థానిక ప్రజల భూములు తీసుకున్నప్పటికీ ప్రాంతీయ యువతకు తగిన ఉద్యోగాలు కల్పించడం లేదని ఆరోపించిన ఆయన, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని పలుమార్లు కోరినా స్పందన లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సింగరేణిని బలోపేతం చేయడం, కార్మికుల హక్కులను పరిరక్షించడం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మంథని అభివృద్ధికి కృషి చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని చందుపట్ల సునీల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కొండపాక సత్యప్రకాశ్, బోగోజు శ్రీనివాస్, సిలివేరి సతీష్, లక్ష్మణ్, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.