Tirumala | భక్తుల మధ్య ఆక్టోపస్ మాక్ డ్రిల్..

Tirumala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్, రాష్ట్ర పోలీసు శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా ఈ భద్రతా శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఉగ్రదాడులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైతే భద్రతా బలగాలు ఎంత వేగంగా స్పందిస్తాయనే అంశాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

తిరుమలలోని పీఏసీ-4 సత్రంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ కమాండోలు, పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. సాధారణ భక్తులు బస చేసే సత్రాన్ని ఉగ్రవాదులు ముట్టడించినట్లుగా ఊహించి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.

ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకోవడం, భవనాన్ని చుట్టుముట్టడం, లోపల ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలను ప్రదర్శించారు. అనంతరం ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావించిన ప్రాంతాల్లో ఆక్టోపస్ కమాండోలు గాలింపు చేపట్టారు.

పూర్తి ఆయుధాలతో భవనంలోకి ప్రవేశించిన కమాండోలు ఒక్కో అంతస్తును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గదులు, కారిడార్లు, ఇతర కీలక ప్రాంతాల్లో జల్లెడ పడుతూ ఉగ్రవాదులను గుర్తించి అదుపులోకి తీసుకునే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

మాక్ డ్రిల్ ప్రారంభానికి ముందే టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. మైక్ ద్వారా ఇది కేవలం భద్రతా శిక్షణ కార్యక్రమమేనని ప్రకటించారు. భక్తులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని స్పష్టం చేశారు.

ఉగ్రదాడులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, స్పందన వేగాన్ని పరీక్షించడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. భక్తుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.