మలిదశ ఉద్యమకారులకు న్యాయం జరగాలి
ఆలేరు, ఆంధ్రప్రభ: తెలంగాణ మలిదశ ఉద్యమకారుల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ కమిటీ నిష్పక్షపాతంగా, తగిన న్యాయం జరిగే రీతిలో కార్యాచరణ జరపాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంపాల శ్రీనివాస్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆలేరు ప్రాంతంలో మలిదశలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో అనేకమంది ఉద్యమకారులు పాల్గొని ప్రాణాలు కోల్పోయి, జైళ్లకు వెళ్లిన పరిస్థితిని పరిగణన లోకి తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ఉద్యమకారులకు తగిన న్యాయం జరిగేలా చూస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు ఆడెపు బాలస్వామి, జిల్లా నాయకులు రచ్చ రాంనర్సయ్య, మొరిగాడి అశోక్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సీస మహేశ్వరి, మాజీ ఎంపీపీ కాసగళ్ల అనసూయ, నాయకులు మొరిగాడి సుజాత, దొంతుల ఎల్లేష్, పుట్టల కిష్టయ్య, ఎలగల కుమారస్వామి, నీల రామన్న, గుజ్జ అశోక్ పాల్గొన్నారు.
