దీక్షకు ముందే గృహ నిర్బంధం
ప్రశాంత్‌రెడ్డి దీక్షను అడ్డుకున్న పోలీసులు
భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆందోళన
100 పడకల ఆసుపత్రి, బస్ డిపో, సీసీ రోడ్లు, మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
వేల్పూర్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని బుధవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వలేదని ఎమ్మెల్యే ఆరోపించారు.
గృహ నిర్బంధం నేపథ్యంలో తన నివాసంలోనే నిరాహార దీక్ష చేపట్టిన ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భీంగల్ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం 70 శాతం పూర్తయినా, మిగిలిన పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.
అదేవిధంగా భీంగల్ బస్ డిపో పునరుద్ధరణ, రూ.12 కోట్లతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణం, మార్కెట్ భవనం పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, వేదికను పోలీసులు తొలగించడమే కాకుండా, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించివేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మూడు నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఐదు నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పనులు పూర్తి చేసే గడువును అధికారికంగా ప్రకటించి ఉంటే తాను దీక్షను విరమించుకునేవాడినని చెప్పారు.
భీంగల్‌లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం, బస్ డిపో పునరుద్ధరణ, సీసీ రోడ్లు, మార్కెట్ నిర్మాణం పూర్తయ్యే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు, పార్టీ శ్రేణులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
