KTR | నార్లాపూర్ పంప్‌హౌస్ వెట్‌రన్‌పై ఎక్స్‌లో స్పందన..
రైతులతో కలిసి సాధించిన విజయమని వ్యాఖ్య
పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారంటూ ప్రభుత్వంపై విమర్శలు..
కన్నెపల్లి మోటార్లు కూడా ప్రారంభించాలని డిమాండ్
KTR | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ పంప్‌హౌస్‌లో వెట్‌రన్ నిర్వహించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో, ఇది రైతులతో కలిసి బీఆర్ఎస్ సాధించిన విజయమని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలు, రైతుల నిరంతర ఒత్తిడి కారణంగానే నార్లాపూర్‌లో జలగర్జన సాధ్యమైందని కేటీఆర్ అన్నారు. అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి నార్లాపూర్‌లోకి చేరుతున్న కృష్ణా జలాలే నిదర్శనమని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వ దూరదృష్టికి ప్రతీకలని అన్నారు. గత రెండున్నరేళ్లుగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రైతులకు అన్యాయం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నార్లాపూర్ పంప్‌హౌస్‌ను ప్రారంభించినట్లుగానే, కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను కూడా వెంటనే ప్రారంభించి రైతులకు నీరు అందించాలని, అదే ప్రభుత్వానికి నిజమైన సమాధానమవుతుందని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.
