టెడ్డీబేర్ బొమ్మలతో ఓటరు జాబితాపై వినూత్న ప్రచారం
ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన కల్పించిన మేదరిపేట సర్పంచ్
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో దండేపల్లి మండలం మేదరిపేట గ్రామంలో సర్పంచ్ చొప్పదండి అనూష రాజేష్ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఓటరు నమోదు, పేర్ల సవరణ, మార్పులు, తొలగింపులపై ప్రజల్లో ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. టెడ్డీబేర్ బొమ్మల వేషధారణలో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి ఓటరు జాబితా సవరణ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ వినూత్న ప్రచారం యువత, మహిళలు, వృద్ధులను విశేషంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు చేయించుకోవాలని కోరారు.
ప్రతి అర్హ పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
