అక్రమ పశువుల రవాణా భగ్నం..
- లారీతో పాటు 24 పశువుల స్వాధీనం
వలిగొండ, ఆంధ్రప్రభ : అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని వలిగొండ పోలీసులు శనివారం తెల్లవారుజామున పట్టుకుని, లారీతో పాటు 24 పశువులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వెంకటాచారి, డ్రైవర్ వెంకటేష్‌లకు అక్రమ పశువుల రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో తోరూరు క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో TN01 BD 1584 నంబర్ గల అశోక్ లేలాండ్ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో 23 ఎద్దులు, ఒక గేదెను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
లారీ డ్రైవర్ ముత్తుకుమార్ తమిళనాడులోని తెని జిల్లా గుడలూరు గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. పశువుల యజమాని అగూర్ల యాదగిరి వరంగల్ జిల్లా వేచేరుని గ్రామానికి చెందినవాడని, వాహన యజమాని సుమయ్య బర్వీన్ తమిళనాడులోని ఉత్తమపాళయానికి చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు.
పశువుల రవాణాకు సంబంధించిన ఎలాంటి బిల్లులు వారి వద్ద లేకపోవడంతో, చేర్యాల మార్కెట్ నుంచి గురజాలకు పశువులను తరలిస్తున్నట్లు వారు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.
లారీతో పాటు పశువులను స్వాధీనం చేసుకుని వలిగొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై క్రైం నంబర్ 196/2026గా కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 325తో పాటు ఏపీ పశు సంరక్షణ చట్టంలోని సెక్షన్లు 5, 6, 9, 10, పశు క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్ 11, 38 మరియు సంబంధిత రవాణా నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ గౌడ్ తెలిపారు.
