యూరియా కోసం నిర‌స‌న‌

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : యూరియా (Urea) ఇక్క‌ట్లు ఇప్ప‌ట్లో తీరిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. వరి విత్త‌నాలు నాటి నెల రోజులు అవుతున్న క్ర‌మంలో ప్రస్తుతం పంటకు యూరియా చాలా కీలకం. ఈ పరిస్థితుల్లో యూరియా కోసం రైతులు ప‌డిగాపులు పడుతున్నారు. ఈక్ర‌మంలోఈ రోజు నల్లగొండ (Nalgonda) పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం దాదాపు అర కిలోమీటర్ మేర రైతులు (Farmers) క్యూలో నిల్చున్న పరిస్థితులు కనిపించాయి. క్యూలో నిలబడ్డ రైతులలో సగం మందికి కూడా యూరియా బస్తాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

యూరియా బ‌స్తాలు అంద‌ని రైతులు దేవ‌ర‌కొండ‌-న‌ల్ల‌గొండ (Devarakonda-Nalgonda) ప్ర‌ధాన ర‌హ‌దారిపై రాస్తారోకోకు చేప‌ట్టారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు (BJP leaders) రైతులకు సంఘీభావం తెలుపుతూ రాస్తారోకోలో కూర్చున్నారు. బీజేపీ నేత పిల్లి రామరాజు యాదవ్ (Pilli Ramaraju Yadav) మాట్లాడుతూ.. యూరియాను అందించడంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌ని మండిప‌డ్డారు. రైతుల రాస్తారోకో తో రోడ్డుకి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వన్ టౌన్ పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.