కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలి

ప్రజా సమస్యలు, అభివృద్ధిపైనే రాజకీయ చర్చలు జరగాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పిలుపు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలకు అన్ని రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి గౌతమ్ కుమార్ అన్నారు. ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమని, అయితే ప్రతి అంశాన్నీ కుల, మత కోణంలో చూపించి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమర్థిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు ఘటనలను కుల, మత కోణంలో చూపిస్తూ రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

హిందూ దేవతలు, జాతీయ నాయకులు, దేశ సార్వభౌమత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో కూడా అలాంటి వ్యాఖ్యలను సమర్థించే విధంగా స్పందించడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. విచారణలో ఉన్న ఘటనలను కూడా కులపరమైన కోణంలో చూపిస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం సమాజంలో విభేదాలను పెంచుతుందని అన్నారు.

చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం కల్పించాలని, నేరాలకు పాల్పడిన వ్యక్తులకు కులం, మతం ఆధారంగా మద్దతు ఇవ్వడం సరైన రాజకీయ విధానం కాదని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధ పరిపాలనకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలని సూచించారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుల, మత విభజనలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధానాలను విడిచిపెట్టి ప్రజా సమస్యలు, అభివృద్ధి, పరిపాలన అంశాలపైనే దృష్టి సారించాలని గౌతమ్ కుమార్ పిలుపునిచ్చారు.