చేతి పంపు దుస్థితి.. కలుషిత నీటితో గ్రామస్థుల ఇబ్బందులు
కన్నాయిగూడెం, (ఆంధ్రప్రభ): కన్నాయిగూడెం మండలంలోని గూర్రెవుల గ్రామ హరిజనవాడలో ఉన్న చేతి పంపు పరిసరాలు అధ్వాన్నంగా మారడంతో తాగునీరు కలుషితమవుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతి పంపు చుట్టూ పిచ్చి గడ్డి పెరిగిపోవడంతో పాటు డ్రైనేజీ నీరు నిల్వ ఉండటంతో నీటి నాణ్యత దెబ్బతిందని, దీంతో ఆ పంపు నీటిని తాగేందుకు ప్రజలు వెనుకాడుతున్నారని తెలిపారు.
ఈ సమస్యపై గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చేతి పంపు పరిసరాలను వెంటనే శుభ్రం చేసి, డ్రైనేజీ సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలని వారు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
