పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్.. కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు, మెరుగైన వేతనాలు కల్పించాలని విజ్ఞప్తి

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలవ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ మాట్లాడుతూ, మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని, వారందరినీ శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని కోరారు. విధుల నిర్వహణలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా అవసరమైన రక్షణ పరికరాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే పంచాయతీ కార్మికులందరికీ నెలకు రూ.30 వేల వేతనం ప్రకటించాలని, వారి కుటుంబాలకు ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.