అనారోగ్య బాధితుడికి రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేత

  • వైద్యానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పులిమామిడి గ్రామానికి చెందిన సుతారి గోపాల్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రాష్ట్ర పాడి పరిశ్రమలు, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శనివారం ఆయన కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎల్‌ఓసీఅందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం సహాయనిధి, ఎల్‌ఓసీ వంటి పథకాల ద్వారా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిమామిడి మాజీ సర్పంచ్ చిన్నా సూరయ్య గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.