హసన్‌పర్తి చెరువులో పడి వృద్ధురాలు మృతి..
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన ఘటన శనివారం హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, హసన్‌పర్తికి చెందిన కోడూరి మీనయ్య భార్య రాజమణి (71) గత పదేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది.
శనివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో హసన్‌పర్తి పెద్ద చెరువులో రాజమణి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని భర్త మీనయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి. దేవేందర్ తెలిపారు.
