Saraswathi Pushkaras |త్రివేణి సంగమంలో జన ప్రవాహం

ఘాట్​ల వద్ద భక్తుల పుణ్య‌స్నానాలు
ట్రాఫిక్ జామ్‌.. క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తున్న పోలీసులు
శైవ‌క్షేత్రంలో భ‌క్తుల ప్రత్యేక పూజలు

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : మ‌రో మూడు రోజుల్లో పుష్క‌ర ఘ‌ట్టం ముగియ‌నుంది. ఎండ‌లు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. దీంతో భ‌క్తులు తండోప‌తండాలుగా త్రివేణి సంగ‌మం వ‌ద్ద‌కు చేరుకుని పుణ్య‌స్నానం చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతి నది పుష్క‌రాలు తొమ్మిదో రోజుకు చేరుకుంది. ద‌క్షిణ భార‌త దేశంలో అంత‌ర్వాహిని స‌ర‌స్వ‌తి న‌ది ఒక్క కాళేశ్వ‌రంలో ఉండ‌డంతో.. దేశ న‌లుమూల నుంచి భ‌క్తులు ఇక్క‌డ‌కు వ‌చ్చి పుష్క‌ర స్నానాలు చేస్తున్నారు. శుక్ర‌వారం వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్తుల‌తో త్రివేణి సంగమం భ‌క్తుల‌తో పోటెత్తింది. పుణ్య‌స్నానాలు చేసేవారు ఇక్క‌డ ఉన్న అమ్మ‌వారు, స్వామివార్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పితృదేవ‌త‌ల‌కు పిండ ప్ర‌దానం చేస్తున్నారు.

గోదావ‌రి మాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు
పుష్క‌ర స్నానం అనంత‌రం గోదావ‌రి మాత‌కు మ‌హిళ‌లు పూజ‌లు చేస్తున్నారు. ప‌సుపు, కుంకుమ‌, పువ్వులు, కొబ్బ‌రికాయ‌లు త‌దిత‌ర పూజా సామ‌గ్రితో పూజ‌లు చేస్తున్నారు. పుష్క‌ర‌ఘాట్ వ‌ద్ద పెద్ద‌ల‌కు త‌ర్ప‌ణాలు ఇస్తున్నారు. మ‌రికొంద‌రు పిండ ప్ర‌దానాలు చేస్తున్నారు. పుణ్య‌స్నానాలు అనంత‌రం చిన్నారులు, విద్యార్థుల‌తో ఏక‌శిల స‌ర‌స్వ‌తి విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు చేయిస్తున్నారు.

అరణ్య శైవక్షేత్రంలో భక్తుల తాకిడి
అర‌ణ్య శైవక్షేత్రంగా పేరొందిన శ్రీ‌కాళేశ్వ‌రం ముక్తీశ్వ‌ర స్వామి ఆల‌యానికి భ‌క్తుల తాకిడి పెరిగింది. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉత్తర ద్వారం, తూర్పు ద్వారం ద్వారా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు క‌ల్పించారు. స్వామివారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు బారులు తీరుతున్నారు. ఈ క్ర‌మంలో రూ.వంద టికెట్ ద్వారా శీఘ్ర దర్శనం రద్దు చేయడంతో అంద‌రికి సర్వదర్శనం క‌ల్పిస్తున్నారు. దివ్యాంగులను సిబ్బంది వీల్ చైర్ల ద్వారా దర్శనానికి తీసుకు వెళుతున్నారు.

అన్నారం-ప‌లుగుల రోడ్డులో ట్రాఫిక్ జామ్‌
పుష్క‌రాలు తొమ్మిదో రోజుకు చేర‌డంతో వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు వాహ‌నాల‌పై ఇక్క‌డ‌కు వ‌స్తున్నారు. దీంతో వాహ‌నాల ర‌ద్దీ పెరిగింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వన్‌వే రూట్ ఏర్పాటు చేసినా త‌ర‌చూ ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లుగుతుంది. శుక్ర‌వారం అన్నారం- పలుగుల రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ క్రమబద్దీకరణను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఏస్పీ కిరణ్ ఖరే పరిశీలించి చర్యలు చేపట్టారు. పూసుకుపల్లి నుండి ఉచిత బస్ సౌకర్యం ద్వారా భక్తులు రవాణాకు ఏర్పాట్లు, భక్తులు ఉచిత రవాణా సేవలు వినియోగించుకుని ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని సూచించారు.

Leave a Reply