వైట్ లైన్లు లేని స్పీడ్ బ్రేకర్లు.. ప్రమాదాలకు ఆహ్వానం
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లకు వైట్ లైన్లు, హెచ్చరిక గుర్తులు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా అధిక వేగంతో ప్రయాణించే సమయంలో స్పీడ్ బ్రేకర్లు ముందుగానే కనిపించకపోవడంతో వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు స్కిడ్ కావడం, వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
స్పీడ్ బ్రేకర్లపై తెలుపు రంగు గుర్తులు లేకపోవడం వల్ల ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ముందు, కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ సమీపంలో, బస్ స్టాండ్ పరిసరాల్లో ఉన్న స్పీడ్ బ్రేకర్లకు వెంటనే వైట్ లైన్లు వేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోడ్లు–భవనాల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను స్పష్టంగా కనిపించేలా తెలుపు రంగుతో గుర్తులు వేసి, తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
