నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం..
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం..
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
గబ్బేట గ్రామానికి మరిన్ని నిధులు
అభివృద్ధి పనుల ప్రారంభం
పలు హామీలు ప్రకటించిన మాజీ ఉప ముఖ్యమంత్రి
ఉమ్మడి వరంగల్ బ్యూరో (ఆంధ్రప్రభ): స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గబ్బేట గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన, గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పని చేసే ప్రజాప్రతినిధులను, పని చేయని వారిని ఒకే విధంగా చూడవద్దని ప్రజలను కోరారు.

గబ్బేట గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, ఎస్సీ కాలనీలో రూ.20 లక్షల సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం నిధులతో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గ్రామస్తులు, లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, అసంపూర్తిగా ఉన్న ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేస్తానని, నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక సర్పంచ్‌ను ఆదేశించారు. ఇప్పటికే గ్రామానికి 18 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, అందులో నాలుగు ఇళ్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను చూస్తుంటే సంతృప్తిగా అనిపిస్తోందని చెప్పారు.

కోమటిగూడెం రహదారిని త్వరలోనే మంజూరు చేస్తామని, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసేందుకు అదనంగా రూ.5 లక్షలు, మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే నెల రోజుల్లో మరో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండున్నర సంవత్సరాల్లో గబ్బేట గ్రామంలో సుమారు రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, వచ్చే ఏడాదిలోపు మరో రూ.కోటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని విస్మరించిందని, ప్రజా సంక్షేమం కంటే ఇతర విషయాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, ప్రజల అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న ఆయన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, సన్న ధాన్యానికి బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూటికంటి ఉపేంద్ర అనిల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
