పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఇద్దరు అరెస్ట్

సదాశివనగర్, ఆంధ్రప్రభ : జూదం ఆడటం చట్టవిరుద్ధమైన నేరమని సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గురువారం అర్ధరాత్రి జూదం ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కుప్రియాల్ శివారులోని మంగలి గుట్ట సమీపంలో ఆకస్మిక దాడి నిర్వహించారు.

దాడి సందర్భంగా ముగ్గురు వ్యక్తులు మూడు కార్డులతో పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన ఒక వ్యక్తి పరారవగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్‌తో పాటు రూ.2,380 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై పుష్పరాజ్ మాట్లాడుతూ, జూదం చట్టవిరుద్ధమైన నేరమని, ఇటువంటి కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.