కలుషిత ఆహార ఘటన.. బాధిత విద్యార్థులకు బీఆర్ఎస్ అండ
- అచ్చంపేట ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శించిన శ్రీకాంత్ భీమా
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
అచ్చంపేట, ఆంధ్రప్రభ: మన్ననూర్ గిరిజన గురుకుల బాలుర సంక్షేమ వసతి గృహంలో కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురై అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీకాంత్ భీమా గురువారం పరామర్శించారు. చికిత్స పొందుతున్న ప్రతి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ భీమా మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యంతో రాజీ పడే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదన్నారు. కలుషిత ఆహార ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అమీనోద్దీన్, రవీందర్ రెడ్డి, చెన్నకేశవులు, మాజీ కౌన్సిలర్లు ఖుతుబుద్దీన్, రమేష్ రావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
