జర్నలిస్టుల ప్రాణాలు కాపాడండి
- క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌ను జర్నలిస్టులకు అమలు చేయాలి
- మంత్రి దామోదర్‌ను కోరిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌ను జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కోరారు.
దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. త్వరలో యూనియన్ నాయకత్వంతో సమావేశమై పథకం రూపకల్పనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీయూడబ్ల్యూజే సంగారెడ్డి జిల్లా మహాసభ గురువారం టీఎన్జీవో సంఘం కార్యాలయంలో జరిగింది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 450 మంది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ మహాసభకు హాజరయ్యారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతా పథకం లేకపోవడంతో గత పదేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో దాదాపు 645 మంది జర్నలిస్టులు అకాల మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌ను జర్నలిస్టులకు కూడా అమలు చేస్తే వారి కుటుంబాలకు ఆరోగ్య పరంగా ఎంతో భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల వృత్తి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణిస్తుందని తెలిపారు.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రత అంశంపై యూనియన్ నాయకత్వంతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అమలు చేయగల విధానంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైసల్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణుప్రసాద్, మాజీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, యూనియన్ సీనియర్ నాయకులు పానుగంటి కృష్ణ, సిద్దిపేట జిల్లా కార్యదర్శి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
