పంటల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోండి: ఏవో కృష్ణ చైతన్య
ఖరీఫ్-2026 సీజన్‌కు బీమా నమోదు గడువులను రైతులు గుర్తుంచుకోవాలి
రాప్తాడు, ఆంధ్రప్రభ: ఖరీఫ్-2026 సీజన్‌కు అమలులో ఉన్న పంటల బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కృష్ణ చైతన్య కోరారు. రాప్తాడు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం వీఏఏలు, వీహెచ్‌ఏలు, రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) కింద రైతులు తమ పంటలకు బీమా చేయించుకోవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, అనావృష్టి, అధిక వర్షాలు, తుఫానులు, వడగండ్ల వానల కారణంగా పంటలు దెబ్బతింటే రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాలు ఉపయోగపడతాయని చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు పంట రుణాలు పొందిన రైతులు బీమా పరిధిలోకి వస్తారని, రుణం పొందని రైతులు కూడా స్వచ్ఛందంగా బీమా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఈ నెల 15వ తేదీలోగా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఈ నెల 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించి నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.
పీఎంఎఫ్‌బీవై కింద ఎకరానికి రైతు వాటా ప్రీమియం వేరుశనగకు రూ.640, పత్తికి రూ.1,140, దానిమ్మకు రూ.3,750, చీనీకి రూ.2,750, టమోటాకు రూ.1,600, అరటికి రూ.3గా నిర్ణయించినట్లు తెలిపారు.
ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద ఎకరానికి రైతు వాటా ప్రీమియం కందికి రూ.80, వరికి రూ.164, జొన్నకు రూ.84, మొక్కజొన్నకు రూ.132, అముదానికి రూ.80, ఎండుమిరపకు రూ.576గా ఉందన్నారు.
అర్హులైన రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, భూ సంబంధిత పత్రాలతో సమీప బ్యాంకులు లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించి పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈవోలు సుజిత, రజిత, రైతులు పాల్గొన్నారు.
