యోగా ద్వారా ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణం సాధ్యం
యోగా ద్వారా ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణం సాధ్యం
యువత యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: యోగా ద్వారా ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కదిరిలో ఆయన ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య సంపద అని పేర్కొన్నారు. వేల సంవత్సరాలుగా భారతీయ జీవన విధానంలో భాగమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందన్నారు.
భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కృషితో యోగాకు అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు లభించిందని అన్నారు.
ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం భారతదేశానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.
యోగా కేవలం వ్యాయామం కాదని, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణను పెంపొందించే సంపూర్ణ జీవన విధానమని వివరించారు.
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధన చేయాలని సూచించారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి ద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబం, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు.
భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యోగా పట్ల ప్రతి భారతీయుడు గర్వపడాలని, ముఖ్యంగా యువత యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఉత్తమ రెడ్డి, ప్రముఖ న్యాయవాది నాగేంద్ర ప్రసాద్, సుదర్శన్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి హసనాపురం చంటి, డీఎల్ ఆంజనేయులు, సోమాల నాయక్, మేకల నాగార్జున, ఇంతియాజ్, ప్రతాప్, నందిశెట్టి బాబు, ఆర్‌సీ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, రియాజ్ అహ్మద్, ఓబుల రెడ్డి, రూరల్ బీజేపీ మండల అధ్యక్షులు రమేష్, వెంకటేష్, రవిచంద్ర నాయుడు, డాక్టర్ జ్ఞానేశ్వర్, జనార్ధన్, సాయికుమార్, మాధవ్ గురుకులం విష్ణు తదితరులు పాల్గొన్నారు.
