వృద్ధురాలికి సీలింగ్ ఫ్యాన్ అందించి మానవత్వం చాటిన సీఐ ఆకుల రఘు

ఆసరా లేని 80 ఏళ్ల మహిళకు అండగా నిలిచిన పోలీసులు..

పట్టణ ప్రజల ప్రశంసలు

నర్సాపురం, ఆంధ్రప్రభ : నర్సాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆకుల రఘు ఓ నిరాశ్రయ వృద్ధురాలికి ఆసరా కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఒంటరిగా జీవనం సాగిస్తున్న వృద్ధురాలికి సీలింగ్ ఫ్యాన్‌ను ఉచితంగా అందించి ఆమెకు అవసరమైన సహాయం చేశారు.

పట్టణంలోని 11వ వార్డుకు చెందిన కాలెపు సూరమ్మ (80) కుటుంబ పరిస్థితుల కారణంగా ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. ఆమె కుమారుడు ఇటీవల మృతి చెందగా, కోడలు అయిన కాలెపు లక్ష్మి క్యాన్సర్ బారినపడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో సూరమ్మను చూసుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వృద్ధురాలి పరిస్థితిని 11వ వార్డు మహిళా పోలీసు సుబ్బలక్ష్మి సీఐ ఆకుల రఘు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఐ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వారు బాధ్యత తీసుకోకపోవడంతో, వృద్ధురాలి దూరపు బంధువైన కనకం చంద్రకళను ఒప్పించి ఆమె సంరక్షణ బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.

చంద్రకళ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ లేకపోవడంతో ఒక ఫ్యాన్ కావాలని కోరగా, సీఐ ఆకుల రఘు వెంటనే స్వచ్ఛందంగా సీలింగ్ ఫ్యాన్‌ను అందజేశారు.

ఈ సేవా కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముత్యాలరావు, 10, 11 వార్డుల మహిళా పోలీసు సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. సీఐ ఆకుల రఘు మానవత్వానికి పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన సేవలను అభినందించారు.